అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన చాలా మంది అత్యున్నత స్థాయి పదవుల్లో ఉన్నారు. తాజాగా మరో తెలుగు తేజం అమెరికాలో అత్యున్నత పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా భారత సంతతికి చెందిన కోమటిరెడ్డి సరిత పోటీ చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు తెలంగాణకు చెందినవారు. తండ్రి డాక్టర్ హనుమంత్ రెడ్డి కార్డియాలజిస్ట్ కాగా, తల్లి డాక్టర్ గీతా రెడ్డి రుమటాలజిస్ట్. 1980లలో వైద్య వృత్తి కోసం అమెరికాలో స్థిరపడిన ఈ దంపతులకు బ్రూక్లిన్‌లో సరిత జన్మించారు. అయితే తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా ఆమె మిస్సోరీలో పెరిగారు. 41 ఏళ్ల సరితకు నలుగురు సంతానం. హార్వర్డ్ కాలేజ్, హార్వర్డ్ లా స్కూల్లో చదివిన సరిత న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన తర్వాత అమెరికా ఫెడరల్ న్యాయ వ్యవస్థలో కీలక బాధ్యతలు చేపట్టారు.

తొలుత యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌లో క్లర్క్‌గా పనిచేశారు. అప్పటి న్యాయమూర్తి బ్రెట్ కవనాగ్ వద్ద క్లర్క్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అనంతరం కొలంబియా లా స్కూల్లో లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత ఫెడరల్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన సరిత ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనీలాండరింగ్, మోసం, విదేశీ ప్రభుత్వ అవినీతి వంటి సంక్లిష్ట కేసులను విచారించారు.

అల్‌ఖైదా, ఐసిస్, మెక్సికన్ డ్రగ్ కార్టెల్స్‌కు సంబంధించిన కేసుల్లోనూ ఆమె పనిచేశారు. అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్‌లో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం హోల్జ్‌మన్ వోగెల్ న్యాయ సంస్థలో భాగస్వామిగా ఉన్నారు. న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ పొందిన తొలి తెలుగు అభ్యర్థిగా సరిత గుర్తింపు పొందారు.















