జపాన్లోని తెలుగు సమాజానికి అండగా నిలుస్తున్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ (టిఏజె) ఆధ్వర్యంలో టోక్యో లోని ఓజిమా 6-చోమ్ ప్రాంతంలో దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జపాన్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు, చిన్నారులు, కమ్యూనిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారతీయ పండుగల విశిష్టతను, ఆధ్యాత్మికతను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు.


ఎక్కడ ఉన్నా మన సంస్కృతి మనతోనే అనే భావనతో, జపాన్లోని తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు భారతీయ సంస్కృతి, ఆచారాలు, పండుగల ప్రాముఖ్యతను పరిచయం చేస్తూ, భావితరాలకు మన సంప్రదాయాలను అందించేందుకు కృషి చేస్తున్నాయి. విదేశీ గడ్డపై భారతీయ పండుగలను ఐకమత్యంతో జరుపుకోవడం ద్వారా తెలుగు సమాజంలో సాంస్కృతిక అనుబంధాలు, స్నేహభావం, సామాజిక ఐక్యత మరింత బలపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.

జపాన్లో తెలుగు భాష, సంస్కృతి, భారతీయ సంప్రదాయాలను కొనసాగిస్తూ, సమాజంలోని కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో టిఏజె నిరంతరం కృషి చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

దసరా పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయాన్ని, అమ్మవారి శక్తి మహిషాసురుడిపై సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారులు, కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు.
















