అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను పదవి నుంచి తప్పుకునే సమయానికి పెద్ద సంఖ్యలో క్షమాభిక్షలు ప్రసాదించనున్నట్లు స్పష్టం చేశారు. తన పరిపాలనలో భాగస్వాములైన అధికారులు, సిబ్బంది భవిష్యత్తులో రాజకీయ కక్షసాధింపులకు గురికాకుండా రక్షణ కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని ఆయన తెలిపారు.

తన ప్రభుత్వంలో సేవలు అందించిన వారు అనవసరంగా రాజకీయ ప్రత్యర్థులతో సుదీర్ఘ కాలం పాటు న్యాయపోరాటాలు చేయాల్సిన పరిస్థితి రాకూడదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. జీవితాంతం ఇలాంటి వేధింపుల నుంచి వారిని కాపాడటానికే తాను ముందుగానే ఈ ముందస్తు క్షమాభిక్షల దిశగా ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే తనకు తాను క్షమాభిక్ష ఇచ్చుకునే అధికారం ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని స్పష్టం చేశారు.















