మధ్యప్రదేశ్‌లో అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఒక వింత ఘటన నిదర్శనంగా నిలిచింది. భోపాల్‌లో డబ్బులు చెల్లిస్తే చాలు ఏకంగా ఒక గాడిద పేరు మీద కూడా నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చని తాజాగా రుజువైంది. సర్టిఫికెట్ల జారీలో జరుగుతున్న భారీ అవకతవకలను బయటపెట్టేందుకు భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్‌యూఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి పర్మార్ వినూత్నంగా ఒక గాడిద పేరుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఈ ధ్రువపత్రాన్ని సాధించారు.

ఎంపీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ‘డాంకీ ఎంపీఎన్‌ఆర్‌సీ’ పేరుతో ఈ సర్టిఫికెట్ జారీ అవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులో తండ్రి పేరు ‘డాంకీ ఫాదర్’ అని, తల్లి పేరు ‘డాంకీ మదర్’ అని, కులం పేరు ‘జంతువు’ అని స్పష్టంగా నమోదు చేసినా అధికారులు ఏమాత్రం తనిఖీ చేయలేదు. కేవలం రూ. 2,050 రుసుము చెల్లించిన ప్రతి ఒక్కరికీ ఎలాంటి అర్హతలు లేకపోయినా సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని రవి పర్మార్ ఆరోపించారు.

ఈ వ్యవహారం కాస్తా బట్టబయలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారి, దీనిపై పోలీసు విచారణ మొదలైంది. అధికారుల తీరును ఎండగడుతూ తాను సేకరించిన ఆధారాలు, పత్రాలన్నింటినీ రవి పర్మార్ పోలీస్ స్టేషన్‌కు హాజరై సమర్పించారు. కనీస పరిశీలన లేకుండా జంతువుల పేరుతో కూడా ఇలాంటి కీలక ధ్రువపత్రాలు జారీ అవుతుండటంతో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.















