అమెరికా ను బాంబ్ సైక్లోన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అతివేగంగా ఏర్పడే తుపానులనే బాంబ్ సైక్లోన్స్ అంటారు. అమెరికాపై ఆకస్మికంగా విరుచుకుపడ్డ ఈ బాంబ్ సైక్లోన్ అట్లాంటిక్ తీరంలోని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వరదలు పోటెత్తి వీధులు నదులను తలపిస్తున్నాయి.థ్యాంక్స్ గివింగ్ డే వేళ బాంబ్ సైక్లోన్ విరుచుకుపడటంతో జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తుపాను ప్రభావంతో కొన్ని చోట్ల గంటకు 100 కిలోమీటర్లకు మించిన వేగంతో ఈదరుగాలులు వీస్తున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు 9 లక్షల మంది ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది. మొత్తం 420 విమానాలు రద్దయ్యాయని, సుమారు 2000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. న్యూజెర్సీ హొబుకెన్ ట్రాన్సిట్ రైల్వే ట్రాక్ వరద నీటిలో మునిగింది. స్టోన్ హర్బర్‌లోకి భారీగా నీరు చేరింది. న్యూయార్క్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఈ తుపాను ప్రభావం అట్లాంటిక్ తీరంలోని 25 రాష్ట్రాల్లో కనిపిస్తున్నది. దాదాపు 25 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.















