చైనాలో కరోనా వైరస్ మరోసారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం వందల సంఖ్యలో కేసులు వెలుగు చూడడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. చైనాలో అతిపెద్ద నగరాలైన షియాన్, టియాంజిన్‌లలో లాక్‌డౌన్ ఆంక్షలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా అన్యాంగ్ నగరంలోనూ లాక్‌డౌన్ విధించింది. దీంతో చైనాలో ఇప్పటి వరకు లాక్‌డౌన్ విధించిన నగరాల సంఖ్య మూడుకు చేరింది.
ఈ నేపథ్యంలో సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్‌లో ఒమిక్రాన్ కేసులను గుర్తించిన అనంరతం లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా చైనాలో లాక్‌డౌన్ విధించిన మూడో నగరమిది. కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులను నియంత్రించడంలో భాగంగా లాక్‌డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నగరవాసుల వాహనాల వినియోగాన్ని నిషేధించారు. సోమవారం ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ సోకగా, మంగళవారం మరో 58 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడిరచారు. దాదాపు 55 లక్షల జనాభా కలిగిన నగరంలో ఇళ్ల నుంచి ఎవ్వరూ బయటకు రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలు మినహా వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పర్యాటక కేంద్రాలుగా పేరొందిన షియాన్ నగరంలో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా, టియాజింన్‌లో పాక్షిక లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగిస్తున్నారు. కోటికి పైగా జనాభా కలిగిన ఆయా నగరాల్లో ప్రజలందరికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు కాంటాక్ట్ ట్రేసింగ్ చేపడుతున్నారు.