అమెరికాలో తెలుగు ఆచార్యుడికి అరుదైన అవార్డు లభించింది. న్యూజెర్సీలో ఉంటున్న త్రివిక్రమ్ రెడ్డి భానోజీ పాలకి న్యూజెర్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌జేఐటీ) ఎక్సలెన్స్ ఆఫ్ టీచింగ్ పురస్కారం ప్రకటించింది. మెకానికల్ విద్య బోధనలో అత్యుత్తమ అధ్యాపకుడంటూ ఆయన సేవలను ప్రశంసించింది. మెషిన్ డిజైన్, మెకానికల్ సిస్టమ్ డిజైన్ తో పాటు స్ట్రెస్ ఎనాలిసిస్‌లను బోధించడంలో త్రివిక్రమ్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రేట్ మై ప్రొఫెసర్ అని ఇచ్చే ర్యాంకింగ్‌లలో ఆయన టాప్ రేటింగ్ సాధించారు.
టీచింగ్ ఫీల్డ్‌లో కొనసాగుతూనే బెక్టన్ డికిన్సన్ కంపెనీలో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ స్టాఫ్ ఇంజనీరుగా కూడా త్రివిక్రమ్ రెడ్డి సేవలందిస్తున్నారు. రోగులకు మందులను సరఫరా చేసేందుకు సరికొత్త పరికరాలను ఆయన రూపొందించారు. ఇలా తాను రూపొందించిన ఏడు పరికరాలపై ఆయనకు పేటెంట్లు ఉన్నాయి. తాజాగా ఎన్.జె.ఐ.టీ వారు ఎక్స్ లెన్స్ ఆఫ్ టీచింగ్ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందని త్రివిక్రమ్ రెడ్డి తెలిపారు. తన బోధనలు, పరిశోధనలు మరింత ఉత్సాహంతో కొనసాగిస్తాను అని అన్నారు.