రష్యాను నిలువరించడంలో ఐసీజే కీలకమని ఉక్రెయిన్ ప్రతినిధి ఆంటోన్ కొరినివిచ్ తెలిపారు. వెంటనే మిలటరీ ఆపరేషన్లు నిలిపివేయాలని రష్యాను ఆదేశించాలని కోరారు. ఒకవేళ మిలటరీ చర్యను ఆపాలని ఐసీజే ఆదేశించినా, రష్యా లెక్క చేయకపోవచ్చని యుద్ధ నిపుణుడు టెర్రీ గిల్ అభిప్రాయపడ్డారు. ఒక దేశం ఐసీజే ఆదేశాలను పాటించకపోతే సదరు దేశంపై చర్య తీసుకోవాలని ఐరాస భద్రతా మండలి ఐసీజే కోరుతుంది. మండలిలో రష్యాకు వీటో పవర్ ఉందని గిల్ తెలిపారు. ప్రస్తుత విచారణకు సైతం రష్యా ప్రతినిధులు హాజరవలేదు. 1940 ఒప్పందం ప్రకారం ఇరు దేశాలకు మధ్య వివాధం తలెత్తితే ఐసీజేను ఆశ్రయించవచ్చు. దీని ఆధారంగా ఉక్రెయిన్ పిటిషన్ వేసింది.
ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో జరిగిన యుద్ధ నేరాలపై దర్యాప్తు ప్రారంభించాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) నిర్ణయించింది. ప్రాథమిక పరిశీలన మేరకు రష్యాపై ఉక్రెయిన్ ఆరోపించిన యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరిగాయని తాను నమ్ముతున్నాని ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీమ్ ఏఏ ఖాన్ తెలిపారు. అయితే అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో జరిగే విచారణలో పాల్గొనేందుకు రష్యా నిరాకరించింది.