తెలంగాణ సరిహద్దు వద్ద జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ముక్త్యాల గ్రామ సమీపంలోని పులిచింతల ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఉదయభానును పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భూభాగం గుండా పోలీసులు ఆయన్ను అనుమతించకపోవడంతో పడవ ద్వారా పులిచింతల ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. పులిచింతల వద్ద తెలంగాణ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని, ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లిన తమను అడ్డుకోవడం దారుణమని ఉదయభాను మండిపడ్డారు. విభజన హామీలను తెలంగాణ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మంత్రులు వైఎస్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని, వారి మాటలు ఏమాత్రం సబబు కాదన్నారు.