కొన్ని కొన్ని విషయాల్లో ప్రజల అభిప్రాయాలను కోరుతుంటారు ప్రధాని మోదీ. ఇప్పటి వరకూ ఓ రెండు మూడు విషయాలపై సోషల్ మీడియా వేదికగా తగు సూచనలు కావాలని గతంలో కోరారు. తాజాగా… పద్మ అవార్డుల విషయంలోనూ ఇదే రకమైన ప్రయత్నాన్ని మోదీ చేశారు. పద్మ పురస్కారాలకు తగిన పేర్లను సూచించాలంటూ సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రజలను అభ్యర్థించారు. నిత్యం ప్రజల్లో ఉంటూ, అసాధారణ కార్యక్రమాలు చేస్తూ, దేశానికి, ప్రజలకు సేవ చేస్తున్న వారిని ‘పద్మ’ పురస్కారాల కోసం సూచించాలని మోదీ కోరారు. పద్మ పురస్కారాలు ఎవరికి దక్కితే బాగుంటుందో, వారి పేర్లను సూచించాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘దేశంలో చాలా మంది అసాధారణ వ్యక్తిత్వం ఉన్న ప్రతిభావంతులున్నారు. అందరి గురించి అంతగా తెలియదు. మనం గమనించం కూడా. ప్రేరణనిచ్చే వ్యక్తుల గురించి మీకు తెలుసా? #peoplespadma కు వారిని మీరు నామినేట్ చేయవచ్చు. సెప్టెంబర్ 15 ఆఖరు తేదీ’’ అని మోదీ ట్వీట్ చేశారు.