పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదవీగండం తప్పేటట్లు కనిపించడం లేదు. తన ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోన్న ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగులనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇమ్రాన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న మూడు పార్టీలు మంత్రివర్గం నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతునట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇమ్రాన్ ప్రభుత్వ మెజారిటీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఓ వైపు ప్రతిపక్షాలన్నీ కలిసి ఇమ్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే కంటే ముందే ఇమ్రాన్ సర్కార్ చిక్కుల్లో పడినట్లైంది.
ఒకవేళ మిత్ర పక్షాలు గనక కేబినెట్ నుంచి వైదొలిగే ప్రతిపక్షాలకు లాభం చేకూరుతుందని, అప్పుడు ఇమ్రాన్‌కు ఇబ్బందేనని ఇమ్రాన్ పార్టీకి మద్దతిస్తున్న పాక్ ముస్లిం లీగ్ ఖ్వాద్ అధ్యక్షుడు చౌధురీ పర్వేజ్ ఎలాహీ హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ వెంటనే మిత్రపక్షాలను కలుసుకోవాలని, వారితో సఖ్యతగా ఉంటూ, వారిని మెప్పిస్తేనే వారందరూ సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగుతారని, లేదంటే ఇమ్రాన్ సర్కార్ కుప్ప కూలడం ఖాయమని చౌధురీ పర్వేజ్ తీవ్రంగా హెచ్చరించారు.