కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని పీసీసీ కార్యదర్శి, హుజూరాబాద్ ఇన్‌చార్జీ పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఇన్నేళ్లుగా అవకాశం కల్పించినందుకు పార్టీకి ధన్యవాదాలు ప్రకటించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయించుకున్నానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పాడి కౌశిక్ రెడ్డిని బహిష్కరిస్తున్నామని పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండ రెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్‌తో కుమ్మక్కై, పార్టీకి ద్రోహం చేసినందుకే బహిష్కరించినట్లు కోదండరెడ్డి ప్రకటించారు.
రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు…
పాడి కౌశిక్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. 50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టారని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టాలని కోరుకున్నవారిలో తాను మొదటవాడినని, హుజూరాబాద్‌లో కాంగ్రెస్ గెలవదన్న రేవంత్ వ్యాఖ్యలు ఎంతో బాధించాయని కౌశిక్ రెడ్డి అన్నారు. తాను అమ్ముడుపోలేదని, రేవంత్ రెడ్డే ఈటలకు అమ్ముడు పోయారని మండిపడ్డారు. ఆరు నెలల్లో కాంగ్రెస్ ఖాళీ అవుతుందని కౌశిక్ రెడ్డి జోస్యం చెప్పారు.