ఏపీ సీఎం జగన్ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. ఆయన అధికారాలకు కత్తెర వేస్తూ నిర్ణయం తీసుకుంది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి (రాజకీయ) బాధ్యతల నుంచి తప్పిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ వైపు సీఎం జగన్‌కు ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తూనే చాలా రోజులగా ప్రవీణ్ ప్రకాశ్ రాజకీయ ముఖ్యకార్యదర్శి లాంటి కీలక పదవిలోనూ కొనసాగుతున్నారు. దీంతో ఆ బాధ్యతల నుంచి ప్రవీణ్ ప్రకాశ్‌ను తప్పించి, ముత్యాల రాజుకు జీఏడీ ముఖ్య కార్యదర్శి పోస్ట్‌ను అప్పగించారు. ప్రవీణ్ ప్రకాశ్ ఒంటెద్దు పోకడ, సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లే సీఎం జగన్ ఆగ్రహానికి గురయ్యారు. కనీసం సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, సీనియర్ల సలహాలను ఏమాత్రం పట్టించుకోకుండా ముఖ్య శాఖల విషయంలో కీలక నిర్ణయాలు తీసేసుకుంటున్నారని కొన్ని రోజులుగా ఈయనపై విమర్శలు వస్తున్నాయి. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కూడా ఈయన వ్యవహార శైలిపై సీరియస్‌గా ఉన్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో కూడా ప్రవీణ్ ప్రకాశ్ తీవ్రంగా విభేదించేవారు. ఎల్వీ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో ప్రవీణ్ ప్రకాశ్ జీడీఏ ముఖ్యకార్యదర్శి హోదాలో కొన్ని ఉత్తర్వులు జారీ చేస్తాననంటే ఎల్వీ అడ్డుచెప్పారు. దీంతో సీఎస్ జారీచేయాల్సిన ఆదేశాలను సీఎం అనుమతితో తానే జారీ చేయవచ్చంటూ ఓ జీవో జారీ చేసేశారు. ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర దుమారమే రేపింది.