ప్రపంచ పట్టం నుంచి ఉక్రెయిన్‌ను తుడిచిపెట్టాలని పుతిన్ ఆకాంక్షిస్తున్నారని, కానీ ఈ ప్రయత్నంలో అతను సక్సెస్ కాలేరని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రష్యానే మునిగిపోతున్నట్లు ఆమె ఆరోపించారు. ఓ పద్ధతి ప్రకారం రష్యా ఇంధనాన్ని దశాలవారీగా నిషేధిస్తామని ఆమె తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను భద్రపరుచుకున్న తర్వాత రష్యా చమురుపై సంపూర్ణ నిషేధం విధిస్తామన్నారు. ఈయూలోని హంగేరి, స్లోవేకియా దేశాలకు మినహాయింపు కల్పిస్తారా లేదా అన్న అంశంపై ఆమె స్పందించలేదు. రష్యాకు చెందిన క్రూడ్ ఆయిల్‌ని ఆరు నెలల్లోగా, రిఫైన్డ్ ఉత్పత్తుల్ని ఈ ఏడాది చివరిలోగా నిషేధిస్తామని వాండర్ తెలిపారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలవాలన్న అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ ఏడాది చివరిలోగా ఉక్రెయిన్ ఆర్థిక రాబడి 50 శాతం పడిపోనున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.