ఒక వ్యక్తి అచ్చం కుక్కలా మారడం కోసం ఏకంగా రూ.12 లక్షలకు పైగా వెచ్చించాడు. అయితే అతడు నిజంగా కుక్క కాలేదు. కుక్కలా అవతారమెత్తాడు. జపాన్‌కు చెందిన టోకోకు నాలుగు కాళ్లున్న జంతువుగా మారిపోవాలన్న కోరిక కలిగింది. అయితే కుక్క రూపమైతే తనకు సరిగ్గా సరిపోతుందని అతడు భావించాడు. దీంతో ఒళ్లంతా బొచ్చుతో పెద్దగా ఉండే జాతి కుక్క కోలీగా మారిపోవాలనుకున్నాడు. దీని కోసం జెప్పెట్ అనే ప్రొఫెషనల్ ఏజెన్సీని సంప్రదించాడు. దీంతో రెండు మిలియన్ యెన్లు (సుమారు రూ.12 లక్షలకు పైగా) వ్యయంతో కూడిన జాతి కుక్క కోలీ కాస్ట్యూమ్‌ను ఆ సంస్థ 40 రోజుల్లో తయారు చేసింది. దీనిని ధరించిన టోకో, అచ్చం కుక్కలా మారిపోయాడు. కుక్క మాదిరిగా హావాభావాలు ప్రదర్శించారు. కుక్క మాదిరిగానే నడిచేందుకు కొంత ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది.