సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తెలంగాణ నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టీటీఏ) మేఘా న్యూజెర్సీ కన్వెన్షన్‌ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. టీటీఏ ప్రతినిధి ఫైళ్ల మల్లారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ యావత్ ప్రపంచంలో ఎక్కడా ఏ జాతికి లేని సాంస్కృతిక వారసత్వం ఒక్క తెలంగాణకు మాత్రమే ఉండడం మన అదృష్టమని పేర్కొన్నారు. ఎన్నో జాతులు వచ్చిపోయాయని, ప్రస్తుతమున్న 3వేల పైచిలుకు జాతులలో ఒక్క తెలంగాణకు మాత్రమే మానవీయ కోణాన్ని ఆవిష్కరించే రీతిలో ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ సంప్రదాయం సొంతమైందని పేర్కొన్నారు. బతుకమ్మతోపాటు బోనాలు, గ్రామదేవతల పేరుతో నిర్వహించే జాతరల ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించవచ్చునని అభిప్రాయపడ్డారు. అమెరికాలో చాటేందుకు తెలంగాణా అమెరికా తెలుగు సంఘం కృషి చేస్తున్నదని కొనియాడారు. మంత్రిని టీటీఏ ప్రతినిధులు సన్మానించారు. టీటీఏ చైర్మన్ మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నంద్యాల దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
