కల్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ కె నిర్మాణంలో దర్శకుడు వశిష్ట ఈ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన రావడంపై చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లో సంస్థ కార్యాలయంలో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ మంచి కథ అందిస్తే థియేటర్లకు తండోపతండాలుగా వస్తారని ప్రేక్షకులు మా బింబిసార చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇండస్ట్రీకి మళ్లీ ఊపిరిలూదారు. అందుకే ఈ చిత్ర విజయం మాది కాదు.. మీదే. ఇంతటి విజయాన్ని అందించినందుకు మా సినిమా ఇండస్ట్రీ మొత్తం మీకు జీవితాతం రుణపడి ఉంటుంది అన్నారు. బింబిసారుడు లాంటి గొప్ప పాత్ర నేను చేస్తే బాగుంటుందని నమ్మి ఈ కథను నా దగ్గరకు తీసుకొచ్చినందుకు దర్శకుడు వశిష్ఠకు థ్యాంక్స్. కీరవాణి తన నేపథ్య సంగీతంతో ఈ చిత్రాన్ని ప్రాణం పోశారు. ఛోటా కె.నాయుడు తన ఛాయాగ్రహణంతో మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ విజయంతో మాపై బాధ్యత మరింత పెరిగింది. బింబిసార`2 మరింత భారీ స్థాయిలో అత్యున్నత గ్రాఫిక్స్ హంగులతో ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వశిష్ఠ, శ్రీనివాస్ రెడ్డి, అనిల్, తమ్మిరాజు, రామకృష్ణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)