అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీలు, కాలేజీల్లో భారతీయ విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి వేదాంద్ ఆనంద్‌వాడేకు (18) అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయం బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు రూ.1.30కోట్ల స్కాలర్షిప్ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్షిప్ లేఖను పంపింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐసీఎస్ఈ సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్ అమెరికాలో న్యూరోసైన్స్ చదవనున్నాడు. విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది. ఈ సందర్భంగా ఆనంద్‌వాడే మాట్లాడుతూ ఇంత గొప్ప అవకాశం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందన్నారు. 17 మంది నోబెల్ పురస్కార గ్రహీతలను అందించిందన్నారు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్ ఫీజు మేరకు స్కాలర్షిప్ లభించడమనేది చాలా గొప్ప విషయమని అన్నారు. ఆనంద్‌వాడే తండ్రి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా పనిచేస్తుంటే, తల్లి ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఈ నెల 12న వేదాంత్ అమెరికా బయలుదేరి వెళ్లనున్నాడు.