కరోనా మహమ్మారిపై పోరులో అమెరికా అనవసర సంకటస్థితి ఎదుర్కొంటోందని ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అపసవ్య దిశలో ప్రయాణిస్తున్నందుకు అసహనంగా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికీ టీకా తీసుకోని వారి వల్ల, వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ వల్ల దేశంలో కేసులు పెరుగుతున్నాయన్నారు. కాబట్టి టీకా వేసుకున్న వారు మాస్కులు విధిగా ధరించాలన్న నిబంధన విధించాలని ప్రభుత్వానికి తాను ప్రతిపాదించినట్టు చెప్పారు. అలాగే, టీకా పొందినప్పటికీ రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి బూస్టర్ డోసు అవసరమని, దీనిపైనా సిఫార్సు చేయాలని అన్నారు.
కాగా, అమెరికాలో ఇప్పటి వరకు 49 శాతం మంది మాత్రమే టీకాలు తీసుకున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. ఇప్పటికీ టీకా తీసుకునేందుకు వెనకాడుతున్న వారితోనే సమస్య అంతా అని పేర్కొన్న ఫౌచీ.. వారందరూ కూడా వెంటనే టీకాలు వేసుకోవాలని కోరారు.