ప్రపంచంలో తెలుగు వారి గుండెచప్పుడుగా తానా నిలుస్తోందని తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో తానా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు లోకేశ్ కొణిదల ఆధ్వర్యంలో నిరుపేదలకు రూ.15 లక్షల ఉపకరణాలను పంపిణీ చేశారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముఖ్య అతిథి అంజయ్యచౌదరి మాట్లాడుతూ ఉత్తర అమెరికాలో తెలుగు వారి భద్రతకు, ఆపదలో ఉన్న వారిని అదుకోవడంలో తానా ముందుంటోందన్నారు. 46 ఏళ్లుగా 72 వేల మంది సభ్యుల సహకారంతో తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్య సేవలందిస్తున్నామని గుర్తు చేశారు.
తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా లోకేశ్ కొణిదల మదనపల్లెలో నిరుపేద మహిళలకు కుట్టుమిషన్లు, విద్యార్థినులకు సైకిళ్లు, ఆదరణ కింద ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారన్నారు.అనంతరం నిరుపేదలకు చేయూత, ఆదరణ కుట్టుమిషన్లు, చెక్కులను పంపిణీ చేశారు.
తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ సునీల్ పట్ర ప్రసంగించారు. తానా సభ్యులను మదనపల్లె టీడీపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, నాదెళ్ల విద్యాసాగర్, పెరవలి నవీన్, మధుబాబు, నిరంజన్ నాని, టీడీపీ నేతలు రాటకొండ బాబురెడ్డి, జయరామనాయుడు, ఎస్‌ఏ మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.