అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో తిమింగళాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులకు అత్యంత అరుదైన దృశ్యం కనువిందు చేసింది. డానా పాయింట్‌లోని డానా స్ట్రాండ్స్ బీచ్‌లో ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కాలిఫోర్నియాలోని కెప్టెన్ డేవ్ డాల్ఫిన్ అండ్ వేల్ వాచ్చింగ్ సఫారీకి తిమింగళాలను చూసేందుకు రోజూ వేల మంది పర్యాటకులు వస్తుంటారు. జనవరి 2న ఆ సఫారీకి వచ్చిన పర్యాటకులకు ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించని అరుదైన దృశ్యం కనిపించింది. కెప్టెన్ డేవ్ కంపెనీ బోటులో సముద్రంలోకి వెళ్లిన పర్యాటకులకు డాల్ఫిన్‌లను, తిమింగళాలను చూపించడం సాధరణమే. కానీ ఓ తిమింగళం బోటు దగ్గరికి రావడం, బోటు కిందకు కూడా వెళ్లి మళ్లీ వెనక్కి తిరగడం, పైగా తన బిడ్డతో వచ్చి విన్యాసాలు చేయడం మాత్రం అత్యంత అరుదు. జనవరి 2న వెళ్లిన పర్యాటకులకు మాత్రం ఆ అరుదైన అవకాశం దక్కింది. వారి బోటు దగ్గరికి ఓ భారీ తిమింగళం, మరో బుల్లి తిమింగళం వచ్చి కనువిందు చేశాయి. తల్లీపిల్లా కలిసి బోటు సమీపంలోనే ఈదుతూ పర్యాటకులను అంచనాలకు మించిన ఆనందాన్నిచ్చాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)