అమెరికాలోని వర్జీనియాలో దారుణం జరిగింది. తరగతి గదిలోనే 25 ఏండ్ల వయసున్న టీచర్‌పై ఓ ఆరేండ్ల బాలుడు కాల్పులు జరిపాడు. బాధిత టీచర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఒకటో తరగతి చదువుతున్న బాలుడు తన తల్లి గన్‌ను స్కూల్‌కు తీసుకొచ్చాడు. టీచర్ అబ్బే వర్నర్ పాఠాలు చెబుతుండగా, ఆమెపై బాలుడు కాల్పులు జరిపాడు. ఆమె ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అయినప్పటికీ బెదరకుండా, మిగతా పిల్లలను కాపాడే ప్రయత్నం చేసింది. పిల్లలందరినీ క్లాస్ రూమ్ నుంచి బయటకు పంపించేసింది.
కాల్పుల శబ్దం విన్న స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, కాల్పులు జరిపిన అబ్బాయిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు చీఫ్ స్టీవ్ డ్రోవ్ తెలిపారు. అయితే ఉద్దేశపూర్వకంగానే బాలుడు కాల్పులు జరిపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని స్పష్టం చేశారు.