అమెరికా విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధిగా వేదాంత పటేల్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌లో తాత్కాలికంగా ప్రతినిధిగా ఆయన కొనసాగనున్నారు. ఆ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైజ్ ఈ నెలలో రిటైర్ కానున్న నేపథ్యంలో భారతీయ సంతతికి చెందిన వేదాంత పటేల్‌కు ఆ అవకాశం దక్కింది. తాత్కాలిక ప్రతినిధిగా వేదాంత పటేల్ పనిచేస్తారని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ఒక ప్రకటనలో తెలిపారు. నెడ్ ప్రైస్ స్థానంలో ఇంచార్జిగా వస్తున్న వేదాంత పటేల్ ఆ బాధ్యతల్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండియాలో పుట్టిన పటేల్ కాలిఫోర్నియాలో పెరిగారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తో పాటు యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. గతంలో అధ్యక్షుడు బైడెన్‌కు అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ, ప్రతినిధిగా పటేల్ చేశారు.