బీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేకే బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్షకు పూనుకున్న ఒకరోజు ముందే విచారణకు రావాలని ఎమ్మెల్సీ కవితకు బీజేపీ జేబు సంస్థ అయిన ఈడీ నోటీసులు జారీచేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. దీనిద్వారా కవిత దీక్షను భగ్నం చేయాలన్న ఆ పార్టీ కుట్ర బహిర్గతమవుతున్నదన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను, విశిష్టతను ఖండాంతరాలకు వ్యాప్తిచెందేలా భారత జాగృతి అధ్యక్షురాలు కవిత కృషిచేశారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ లాంటి పట్టణాల్లో, విదేశాల్లో ఆత్మన్యూనతకు గురైన బతుకమ్మ పండుగను, నేడు అధికారికంగా నిర్వహించేస్థాయికి తీసుకొచ్చారని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిష్టించే దాకా అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించారని గుర్తుచేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశవ్యాప్తంగా మహిళలను ఐక్యంచేసి ఢిల్లీ వేదికగా జంతర్‌మంతర్‌లో ధర్నాకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆమె దీక్షకు భయపడిన బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈడీని ఉసిగొల్పిందని విమర్శించారు. అయినా ఎవ్వరికీ తలవంచని తెలంగాణ బిడ్డ కవిత దీక్షను విజయవంతంగా పూర్తిచేసి మహిళా రిజర్వేషన్ బిల్లును సాధిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.