ఈగలపాటి ఇందిర గల్ఫ్ దేశాలలో ఉంటున్న భారతీయులందరికీ గర్వకారణమని విదేశీ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ ఔసాఫ్ సయాద్ పెర్కొన్నారు. సౌదీ అరేబియా ఉన్నతాధికారులతో ద్వైపాక్షిక సంబంధాల గూర్చి చర్చించడానికి న్యూ ఢిల్లీ నుండి వచ్చిన ఆయనతో రియాధ్ నగరంలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఇందిర ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారతీయ రాయబారి డాక్టర్ సోహేల్ ఏజాజ్ ఇతర భారతీయ అధికారులు, ప్రముఖులందరి సమక్షంలో తెలుగునాట ఒక పల్లె నుండి ప్రతికూల పరిస్ధితులను ఎదుర్కొంటూ మెట్రో పైలట్‌గా ఎదిగి సౌదీ అరేబియాలో పని చేయడాన్ని ఔసాఫ్ సయీద్ అభినందించారు. సౌదీ అరేబియాలో భారత ప్రతిష్ఠను పెంపొందించే వ్యక్తులలో ఇందిర ఒకరని భారతీయ దౌత్యవేత్తలు ప్రశంసించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామానికి చెందిన ఇందిర ప్రస్ధానం గూర్చి తెలుసుకోన్న భారతీయ రాయబారి ప్రత్యేకంగా అమెను పిలిపించి తన కుటుంబ సభ్యులకు పరిచయం చేసారు. అదే విధంగా భారతీయ అధికారులు, ఇతర ప్రముఖులు కూడా తమ కూతుళ్ళను ఇందిరకు పరిచయం చేస్తూ అమెను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. 25 లక్షలకు మందికి పైగా భారతీయులు ఉంటున్న సౌదీ అరేబియాలో ఒక భారతీయ మహిళ అందునా తెలుగు మహిళకు దక్కిన తొలి గౌరవం ఇది.