ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్న పౌరాణిక నేపథ్య చిత్రం ఆది పురుష్ . ఓం రౌత్ దర్శకుడు. టీ సిరీస్, రెట్రో ఫైల్స్ పతాకాలపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. కృతి సనన్ సీత పాత్రను పోషిస్తున్నది. తాజాగా ఈ సినిమా న్యూయార్క్‌లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ కోసం ఎంపికైంది. జూన్ 13న ఈ చిత్రాన్ని అక్కడ ప్రదర్శించబోతున్నారని చిత్రబృందం వెల్లడించింది. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ అంతర్జాతీయ చిత్రోత్సవాలైన ట్రిబెకా ఫెస్టివల్‌కు మా సినిమా ఎంపికవడం సంతోషంగా ఉంది. మన సంస్కృతిలో బలంగా ఇమిడిపోయిన ఒక కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతున్నాం. ఆ ప్రేక్షకుల స్పందన కోసం వేచి చూస్తున్నాం అని అన్నారు. అత్యున్నత సాంకేతిక విలువలు, భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 2డీతో పాటు త్రీడీ, ఐమాక్స్ వెర్షన్‌లో జూన్ 16న ఈ సినిమా విడుదలకు ముస్తాభవుతున్నది.


