కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల పగ్గాలు చేపట్టిన బసవరాజు బొమ్మై తొలిసారిగా మంత్రివర్గాన్ని విస్తరించారు. 29 మందిని కేబినెట్లోకి తీసుకున్నారు. బెంగళూరులోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్‌లో గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ వీరందరి చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు. వీరిలో 23 మంది తాజా మాజీ సీఎం యడియూరప్ప కేబినెట్లోనూ మంత్రులుగా ఉన్నవారే. మిగతా ఆరుగురు కొత్తవారు. ఈసారి కేబినెట్లో డిప్యూటీ సీఎం పదవి ఉండబోదని సీఎం బసవరాజు మంత్రివర్గ విస్తరణకు ముందే స్పష్టం చేశారు. మాజీ సీఎం యడియూరప్ప చిన్న కుమారుడు, బీజేపీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు బీవై విజయేంద్రకు బొమ్మై కేబినెట్లో స్థానం దక్కలేదు. యడియూరప్ప కేబినెట్లో ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కానీ ఈసారి డిప్యూటీ సీఎం పదవే ఉండదు. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఈసారి డిప్యూటీ సీఎం పదవి లేదు అని బొమ్మై తెలిపారు.
కొత్త మంత్రుల్లో ఎనిమిది మంది లింగాయత్ వర్గానికి చెందినవారు ఉన్నారు. ఏడుగురు ఒక్కలిగ వర్గం వారు కాగా, ఏడుగురు ఓబీసీలుఉన్నారు. ముగ్గురు ఎస్సీ, ఇద్దరు బ్రాహ్మణ, ఒకరు ఎస్టీ, ఒకరు రెడ్డి వర్గీయులు కాగా, ఒక మహిళా ఎమ్మెల్యేనూ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సునీల్ కుమార్, అగర జ్ఞానేంద్ర, మునిరత్న, హాలప్ప ఆచార్, మునేనకుప్ప, శంకర్ పాటిల్‌కు తొలిసారిగా కేబినెట్లో చోటు దక్కింది.