స్టార్ హీరోయిన్ సమంతపై వీరాభిమానంతో ఓ అభిమాని ఆమె విగ్రహాన్ని తయారు చేయించి గుడినే నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లాకు చెందిన వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో గుడి నిర్మించడానికి స్థలం కేటాయించాడు. బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ నటి సమంతకు వీరాభిమాని. ఆమె నటిగా వుండటంతో పాటు పలు సేవా కార్యక్రమాలకు, ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంలో చేస్తున్న నిస్వార్థ సేవకు ముగ్ధుడైన సందీప్ సమంతపై అభిమానం మరింత పెరగడంతో గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు.తన ఇంటి ప్రాంగణంలోనే సమంత ఆలయం కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా సిద్ధం చేయించాడు. ప్రస్తుతం విగ్రహం, గుడి పనులు తుది దశలో వున్నాయి. ఈ నెల 28వ తేదీన ఆలయం ప్రారంభిస్తున్నట్లు సందీప్ చెప్పారు.
సమంతకు సందీప్ గుడి కట్టడమే కాదు, మయోసైటిస్ నుంచి కోలుకున్న సందర్భంగా తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గా దైవ క్షేత్రములకు మొక్కుబడి యాత్ర నిర్వహించినట్టు తెలిపాడు. త్వరలో సమంతను కలిసే అవకాశం కోసం వేచిచూస్తున్నా అంటున్నాడు సందీప్. సమంతకు సరికొత్త కానుకను సిద్దం చేస్తున్న సందీప్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.