గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన సినిమా రామబాణం. శ్రీవాస్ దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మే 5న విడుదల కానుంది. తాజాగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దర్శకుడు శ్రీవాస్ మాట్లాడుతూ సినిమా ఔట్పుట్ చూశాక మేము ఎలాంటి సినిమా చేయాలనుకున్నామో ఆ కోరిక నెరవేరింది అనిపించింది. ఇందులో కుటుంబ అంశాలతో పాటు మంచి యాక్షన్ సీక్వెన్సులు కూడా ఉంటాయి. ఇంటర్వెల్, ైక్లెమాక్స్ సినిమాకే ఆకర్షణ అవుతాయి. ద్వితీయార్ధంలో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ మెప్పిస్తాయి. సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ వంటి అంశాలతో మిమ్మల్ని సినిమా అలరిస్తుంది అన్నారు.
హీరో గోపీచంద్ మాట్లాడుతూ దర్శకుడు శ్రీవాస్‌తో లక్ష్యం, లౌక్యం సినిమాలు చేశాను. ఆ రెండూ విజయాలు సాధించాయి. మూడో చిత్రం చేద్దామని అనుకున్నప్పుడు అలాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలని అనుకున్నాం. భూపతి రాజా అందించిన కథకు అబ్బూరి రవి, మధు మంచి మార్పులు చేశారు. ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మాతలు నిర్మించారు. డింపుల్‌కు మంచి ఫ్యూచర్ ఉంది. మిక్కీ జే మేయర్ సంగీతం ఆకట్టుకుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా అన్నారు.
నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ ఈ వేసవిలో సకుటుంబంగా ప్రేక్షకులు చూసే చిత్రమవుతుంది. గోపీచంద్ సినిమాల్లోని యాక్షన్ ఇష్టపడేవారికి కావాల్సిన పోరాట ఘట్టాలుంటాయి. మా సంస్థకు మరో విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో నాయిక డింపుల్ హయతి, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.