గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో భారతీయ మూలాలు ఉన్న తంగరాజు సుప్పియ్యను సింగపూర్‌లో ఉరి తీశారు. మరణశిక్ష అమలును వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ దేశాలు ఆందోళన చేపట్టినా, సింగపూర్ మాత్రం ఉరి శిక్షను అమలు చేసింది. చంగీ ప్రిజన్ కాంప్లెక్స్‌లో 46 ఏళ్ల తంగరాజును ఉరి తీసినట్లు సింగపూర్ ప్రిజన్స్ సర్వీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2017లో తంగరాజుపై కేసు నమోదు అయ్యింది. 2018లో అతనికి శిక్షను ఖరారు చేశారు.
తంగరాజును ఉరి తీయరాదు అని బ్రిటీష్ వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్సన్ తెలిపారు. డ్రగ్స్‌ను పట్టుకున్న సమయంలో తంగరాజు అక్కడ సమీపంలో లేరని ఆయన అన్నారు. అయినా కానీ ఓ అమాయకుడిని ఉరి తీస్తున్నారని ఆయన ఆరోపించారు. తంగరాజును దోషిగా తేల్చారని సింగపూర్ హోంమంత్రిత్వశాఖ తెలిపింది. డ్రగ్స్ డెలివరీ కోసం రెండు మొబైల్ ఫోన్లు వాడారని పోలీసులు తెలిపారు.