హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సమావేశంలో చేసిన తీర్మానాలకు బీఆర్‌ఎస్ బహ్రెయిన్ శాఖ సంపూర్ణ మద్దతును ప్రకటించింది . ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్‌ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలిపిన సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. కేసీఆర్ పాలన తొమ్మిదేండ్లలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవడం హర్షణీయమని కొనియాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతోపాటు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలిసిన రైతు బిడ్డ సీఎంగా ఉండడం అదృష్టమని పేర్కొన్నారు. రాష్ట్రంపై విషం చిమ్ముతూ, అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తున్న బీజేపీ ప్రభుత్వం ఆగడాలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఉపాధ్యక్షుడు బొలిశెట్టి వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి మాట్లాడుతూ నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అనే నినాదం కనమరుగైందని ఆరోపించారు. దేశంలో ప్రగతి జరగాలన్నా, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా కేసీఆర్‌తోనే సాధ్యమని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అన్నారు.