ఉక్రెయిన్ లో రష్యా సాగిస్తున్న యుద్ధా నేరాలపై సాక్ష్యాధారాలను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు కు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని అగ్రరాజ్య రక్షణ కార్యాలయం పెంటగాన్ వ్యతిరేకించినా ఆయన ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న యుద్ధ నేరాలపై చర్యలు తీసుకునే విషయంలో అమెరికా ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రష్యా ఆగడాలను పెంటగాన్ పట్టించుకోవట్లేదని రిపబ్లికన్లతో పాటు డెమోక్రాట్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై సెనెట్‌లో గతవారం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రష్యా నేరాలపై అమెరికా సేకరించిన సాక్ష్యాలను అంతర్జాతీయ కోర్టుతో పంచుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఆ షరతు మీదనే గతవారం సెనెట్‌లో ఓ బిల్లును ఆమోదించినట్లు తెలిసింది.
