ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా తన ఉద్యోగులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతీ వారంలో కనీసం మూడు రోజులు ఆఫీసుకు వచ్చి పనిచేయాలన్న నిబంధనలను పాటించని వారు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు మెటా మానవ వనరుల అధిపతి లోరీ గోలెర్ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. సెప్టెంబర్ 5 నుంచి కార్యాలయాలకు కేటాయించిన ఉద్యోగులు వారానికి మూడు రోజులు కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేశారు. సంస్థ లక్ష్యం ఉద్యోగుల మధ్య మంచి అనుబంధం, బలమైన టీమ్ వర్క్‌ను ప్రోత్సహించడమే అని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్యోగులు సంస్థ సూచనలను పాటిస్తున్నారా..? లేదా..? అన్నది మేనేజర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. నిబంధనలను పాటించనివారిపై స్థానిక చట్టాల కింద తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరచూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలిపారు. ఇందులో ఉద్యోగుల పనితీరు రేటింగ్‌ను తగ్గించడం, సమస్య అలాగే కొనసాగితే ఉద్యోగం నుంచి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు.