అమెరికా పర్యటనలో భాగంగా భారత పార్లమెంట్ సభ్యులు కనుమూరు రఘురామ కృష్ణంరాజు నార్త్ కెరొలినా రాష్ట్రం ఛార్లెట్‌లో పర్యటించినప్పుడు ఆయనకు ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా పలువురు ఆయనతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికి దాదాపు 200 మంది ఎన్నారైలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్య అతిథి రఘు రామ కృష్ణం రాజును నాగ పంచుమర్తి ఆహ్వానించి పరిచయం చేయగ, ఠాగూర్ మల్లినేని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలకగా, తను అందరితో కలివిడిగా మాట్లాడుతూ, కుశల ప్రశ్నలు వేస్తూ ఉత్సాహంగా కనిపించారు. అందరూ ఆసీనులవగా ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొందరు స్థానికులు సభికులనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం రఘురామ కృష్ణంరాజు ని వేదిక మీదకు ఆహ్వానించగా, ఎప్పటిలానే గోదావరి వాళ్ళ స్టయిల్లో ప్రసంగించి ఆకట్టుకున్నారు. వైఎస్. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా అధోగతి పాలయ్యింది, వ్యవస్థలను నిర్వీర్యం చేసిన విధానం, ఫేక్ ఉచిత తాయిలాలు, తన నియోజకవర్గం నరసాపురం వెళ్ళడానికి సృష్టిస్తున్న ఇబ్బందులు, 2024 ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రక అవసరం వంటి విషయాలపై కూలంకుషంగా వివరించారు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. తదనంతరం అందరికీ విందు భోజనం అందించారు. చివరిగా వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, బాలాజి తాతినేని, సతీష్ నాగభైరవ, శ్రీమాన్ రావి, సురేష్ కొత్తపల్లి తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.


