అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెలలో భారత్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. 9-10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల పర్యటన నిమిత్తం బైడెన్ భారత్‌కు వస్తున్నారు. కాగా, సమావేశాలకు రెండు రోజుల ముందే బైడెన్ భారత్‌కు రానున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. సమావేశాల్లో పాల్గొనడంతోపాటు మోదీ తో ప్రత్యేకంగా సమావేశమవుతారని వెల్లడించింది.
ఈనెల 7వ తేదీన బైడెన్ భారత్ పర్యటనకు బయలుదేరుతారని తెలిపింది. 8వ తేదీన ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారని వెల్లడించింది. ఆ తర్వాత 9-10 తేదీల్లో జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారని పేర్కొంది. ఈ సమావేశాల్లో అంతర్జాతీయ సమస్యలు, వాతావరణ మార్పులు, క్లీన్ ఎనర్జీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తదితర అంశాలపై ప్రపంచ దేశాల నేతలతో చర్చిస్తారని వెల్లడించింది. రష్యా నేత పుతిన్ ఈ భేటీకి రావడం లేదు. కాగా చైనా అధినేత హాజరీ గురించి స్పష్టత లేదు. ప్రెసిడెంట్ బైడెన్ ఇక్కడి నుంచి ఈ నెల 10న వియత్నాం పర్యటనకు వెళ్లుతారు.