దేశ రాజధాని ఢిల్లీ నగరం జీ20 సదస్సుకు సిద్ధమైంది. ఈ నెల 9-10 వరకు జరుగనున్న జీ20 సమావేశాలకు ప్రపంచ దేశాలకు చెందిన అధినేతలు భారత్కు తరలిరానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్ ప్రధాని ఫిమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, దక్షిణ కొరియా అధ్యక్షుడు సహా 20 దేశాల అధ్యక్షులు, ప్రధానులు సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకోనున్నారు.
నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ న్యూఢిల్లీ చేరుకోగా, విమానాశ్రయంలో మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్ ఆయనకు స్వాగతం పలికారు. ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ న్గోజీ ఒకోంజో గురువారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఐఎంఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా సైతం జీ20 సదస్సు కోసం భారత్కు వచ్చారు. వీరితో పాటు యూరోపియన్ యూనియన్ కమీషన్ ప్రెసిడెంట్ ఉర్సుసులా వాన్ డెర్ లేయన్, మారిషస్ పీఎం ప్రవీద్ కుమార్ జగన్నాథ్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్ జీ20 సదస్సు కోసం భారత్ చేరుకున్నారు.