అమెరికాలోని వర్జీనియాలో లోటస్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ నెల ఏడో తేదీన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ అవధానులు నరాల రామిరెడ్డి అధ్యక్షత వహించారు. కథా-నవలా రచయిత, ఫిలిం మేకర్ వేణు నక్షత్రం ఆధ్వర్యంలో, వాషింగ్టన్ సాహితీ సంస్థ నిర్వాహకులు రవి వేలూరి, సాహిత్యాభిమానులు ప్రసాద్ చెరసాల, కవి చంద్ర కాటుబోయిన, పవన్ గిర్లా, ప్రవీణ్ దొడ్డ సంయుక్త నిర్వాహణలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రముఖ కవి, కథానవలా రచయిత, వ్యాసకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో దేన్నైయినా, ఎంత కఠినాత్ములైనా ప్రేమతో మాత్రమే జయించవచ్చునన్నారు. శత్రువుని ఎదిరించడానికి సాహిత్యాన్నే ఆయుధంగా ఉపయోగించానని తెలిపారు. బలహీనులని పీడిస్తే, ఏదో ఒకరోజు వారు తిరగబడతారని బలవంతులు గ్రహించాలని అన్నారు. తన రచనలన్నీ సమాజంలో జరిగిన సంఘటనలేనని, వాటి ద్వారా కొంతైనా అవగాహన కల్పించడమే తన ఉద్దేశ్యం అని పేర్కొన్నారు.
సభా నిర్వాహకులు వేణు నక్షత్రం మాట్లాడుతూ ఇనాక్‌కు ఇప్పటికే వచ్చిన ఎన్నో అవార్డులతోపాటు ఉత్తమ తండ్రి అనే అవార్డు కూడా ఇవ్వాలని అన్నారు. ఎందుకంటే ఇనాక్ కానీ, తన ముగ్గురు పిల్లలు కానీ ఎలాంటి రిజర్వేషన్లు ఉపయోగించకుండా కేవలం ప్రతిభతో అత్యుత్తమ చదువులు చదివి సమాజంలో అధ్యాపకులుగా, క్లాస్ వన్ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో ఇనాక్ గారి సాహిత్యం ఎంతో ఉపయోగపడిందన్నారు. మునివాహనుడు కల్పిత నవల అంశం ఇప్పుడు సమాజంలో మునివాహన సేవగా ప్రాచుర్యం పొందడం లాంటి ఘనత శ్రీ ఇనాక్ గారి రచనలకే చెందిందని కొనియాడారు.
సభాధ్యక్షులు నరాల రామిరెడ్డి మాట్లాడుతూ కొలకలూరి ఇనాక్ సభకు అధ్యక్షత వహించడం తన అదృష్టమన్నారు. ఇనాక్ రచనలు చాలా చదివానని, సాహిత్యంలో కథ, నవల, పద్యం, వ్యాసం ఇలా ప్రతి అంశాన్ని సృజించి ప్రతి ప్రక్రియలో అవార్డులు పొందిన ఘనత శ్రీ ఇనాక్ ది అన్నారు.
ఈ సందర్భంగా కొలకలూరి ఇనాక్, నరాల రామిరెడ్డిలను రవి వేలూరి, రమేష్ రావెళ్ల శాలువాతో సత్కరించారు. కాపిటల్ ఏరియా తెలుగు అధ్యక్షులు సతీష్ వడ్డీ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ప్రతి ఏటా ఒకసారి ప్రత్యేక సాహిత్య సమావేశాల నిర్వహణకు ప్రయత్నిస్తానని చెప్పారు. అమెరికాలో తెలుగు సంస్థలు ప్రతి రెండేళ్ళకోసారి కోట్ల ఖర్చుతో సదస్సు నిర్వహిస్తారన్నారు. కానీ అందులో సాహిత్యానికి తగిన ప్రాముఖ్యత లభించడం లేదని, అందుకే ప్రతి సంవత్సరం ఒక సారి ప్రత్యేక సాహితీ సమావేశాలు నిర్వహిస్తే, తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించిన వారవుతారని అమెరికాలోని తెలుగు సంఘాలను వేణు నక్షత్రం కోరారు. ఈ కార్యక్రమంలో వర్జీనియా, వాషింగ్టన్, మేరీలాండ్ ప్రాంతాల సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.