తెలుగు అసోసియేషన్-యూఏఈ (యుఏఈ ప్రభుత్వముచే గుర్తింపబడిన తెలుగు అసోసియేషన్) వారు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవమును నవంబర్ 18వ తేది న దుబాయి లోని ” రాయల్ కాంకార్డ్ హోటెల్ ” నందు గల “ఫాల్కన్ బాల్ రూం“లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గములో జనరల్ సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ విజయ భాస్కర్ రెడ్డి గారు ప్రధాన నాయకత్య భాద్యతలు నిర్వహించారు. శ్రీ మోహన కృష్ణ గారు సంధాన కర్తగా వ్యవహరించి కార్యక్రమాన్ని ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదభరితంగా నిర్వహించారు.
తెలుగు అసోసియేషన్ ఆవిర్భావానికి కీలక సహకారమందించిన గౌరవనీయులు శ్రీ రాషిద్ అల్ మకూధి గారు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి, నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసారు. గణపతి ఆరాధన నృత్య ప్రదర్శన, యూఏఈ-భారత దేశాల జాతీయ గీతాలాపనలతో కార్యక్రమం శుభారంభమైనది.
కార్యక్రమానికి ప్రారంభోపన్యాసము చేసిన శ్రీ మోహన కృష్ణ గారు, తెలుగు అసోసియేషన్ ఆవిర్భావానికి వ్యవస్థాపక సభ్యులు చేసిన కృషిని, గత కార్యవర్గము నిర్వహించిన కార్యక్రమాల వివరాలను విశదీకరించారు. భారత దేశ అత్యున్నత న్యాయ స్థానము నందు ప్రధాన న్యాయముర్తి గా బాద్యతలు నిర్వ్హించిన శ్రీ ఎన్ వీ రమణ గారిని, భారత దేశ ఉప రాష్ట్రపతి గా సేవలందించిన శ్రీ వెంకయ్య నాయుడు గారిని గారిని సన్మానించుకునే సదవకాశము తెలుగు అసోసియేషన్ కు కలగడం, ఆ ఇరువురి ప్రముఖులకు తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల వున్న అపారమైన గౌరవాభిమానముల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తెలుగు అసోసియేషన్ మొట్ట మొదటి సారిగా నిర్వహించిన ఎన్నికలు, అవి జరిగిన తీరుతెన్నుల గురించి వివరించారు. నూరు శాతం వోటింగ్ సాధించటం, తెలుగు అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించిన తీరుకు ఎంతగానో ప్రతిష్ఠని చేకూర్చింది. వోటర్లకు ఎన్నికలపై ఆద్యంతం ఆశక్తిని కలిగిస్తూ, విదేశీ పర్యటనలలో వున్న వారు కూడా అమూల్యమైన వారి వోటు హక్కుని వినియోగించుకునే సదవకాశం కల్పించిటం, వారికి వోటింగ్ ప్రక్రియను పూర్తి గోప్యతతో పాటిస్తూ ఎలక్టానిక్ విధానములో నిర్వహించటం, వోట్ల గణన వోటర్లు-పోటీదారుల సమక్షములో అత్యంత పారదర్శకతతో జరపటం, తెలుగు వారి సాంప్రదాయ వస్త్రధారణ లో ఎన్నికల తంతుని నిర్వహించటం వంటి ఎన్నో మైలురాళ్ళను మొదటి విడతలోనే సాంధించటములో తెలుగు అసోసియేషన్ ఎన్నిక సంఘము, అందులో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీ ప్రకాష్ ఇవటూరి గారిని, శ్రీ శ్రీధర్ గారిని, శ్రీ మురళీ కృష్ణ గారిని అందరూ ప్రశంసించారు.
కొంత మందిని ఏకగ్రీవంగా ఎన్నుకోవటం, కొంత మంది పూర్తి ఆధిక్యముతో గెలవటం, ప్రతిష్టాత్మకమైన చైర్మన్ పదవికి వెంట్రుక వాసి తేడాతో ఆధిక్యం రావటం వంటి పరిణామాలు, ఎన్నికల ఫలితాలను ఉత్కంఠ భరితంగా మలిచాయి.
నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గ సభ్యులందరూ ఒక్కొక్కరిగా వేదిక పైకి విచ్చేసి, మాతృభాషలో ప్రమాణ స్వీకారము చేసారు. చైర్మన్ గా శ్రీ వివేకానంద్ బలుస గారు, అధ్యక్షుడిగా శ్రీ మసివుద్దీన్ మొహమ్మద్ గారు, వైస్ చైర్మన్ గా శ్రీ సుదర్షన్ కటారు గారు, ప్రధాన కార్యదర్శి గా శ్రీ విజయ భాస్కర్ రెడ్డి గారు, కోశాధికారి గా శ్రీ శ్రీనివాస్ గౌడ్ రాచకొండ గారు, మార్కెంటింగ్ డైరెక్టర్ గా శ్రీనివాసరావ్ యెండూరి గారు, అంతార్జాతీయ వ్యవహారాల విభాగ డైరెకర్ గా శ్రీ సురేంద్రనాథ్ ధనేకుల గారు, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్ గా శ్రీ శ్రీధర్ దామర్ల గారు, తెలంగాణ సంక్షేమ కార్యక్రమాల విభాగ డైరెక్టర్ గా శ్రీ చైతన్య చకినాల గారు, సాంఘిక సేవల విభాగ డైరెక్టర్ గా శ్రీ భీం షంకర్ బంగారి గారు, సాంస్కృతిక కార్యక్రమాల విభాగ డైరెక్టర్ గా శ్రీమతి లతా నగేష్ గారు, మీడియా విభాగ డైరెక్టర్ గా శ్రీ అబ్దుల్ ఫహీం షేక్ గారు, న్యాయ మరియు కార్యాలయ వ్యవహారాల విభాగ నిర్వహకుడు గా శ్రీ సత్యసాయి ప్రకాష్ సుంకు గారు బాధ్యతలు స్వీకరించారు.
ప్రమాణ స్వీకార దినోత్సవం నాడే కొందరు దాతల సభ్యత్వము స్థాయిలో మరియు జీవిత కాల సభ్యత్వములో తెలుగు అసోసియేషన్ లో చేరటం యూఏఈలోని తెలుగు సమాజములో అసోసియేషన్ కు పెరుగుతున్న ఆదరణ, తెలుగు వారికి సేవ చేయాలనుకునే వారి సహృదయత లను తెలియపరిచింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి, గల్ఫ్ మైనారిటీ కమ్యూనిటీ (GMC) తరపున శ్రీ అబ్దుల్లా గారు, శ్రీ ఖాజా గారు, శ్రీ షరీఫుద్దీన్ గారు, శ్రీ జాఫర్ అలీ గారు మరియు అంధ్రప్రదేష్ ప్రవాసీయుల తెలుగు సంఘం (APNRT) తరపున శ్రీ అక్రం గారు, శ్రీ చక్రి గారు, శ్రీ ఉదయభాస్కర్ రెడ్డి గారు విచ్చేసి నూతన కార్యవర్గ సభ్యులందరిని శాలువాలతో సత్కరించి, శుభాబినందనలు తెలియజేసారు. విచ్చేసిన పలువురు వక్తలు ప్రసంగిస్తూ, తెలుగు అసోసియేషన్ కి తమ సంఘీభావము తెలుపుతూ, గడచిన రెండేళ్ళలో అసోసియేషన్ సాధించిన ప్రగతిని ప్రశంసిస్తూ, నూతన కార్యవర్గం రాబోయే రెండు సంవత్సరాలలో మరెన్నో మంచి కార్యక్రమాలతో ముందుకు రావాలని, యూఏఈ లోని తెలుగు వారందరినీ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒకే తాటిపైకి తేవటానికి మరింత చొరవ చూపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ చేసిన కోశాధికారి శ్రీ మురళీకృష్ణ గారు, నూతన కార్యవర్గ సభ్యులందరినీ పుష్ప గుచ్ఛము, పూలమాలతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేసారు.
చైర్మన్ శ్రీ వివేకానంద్ బలుస గారు, అధ్యక్షుడు శ్రీ మసివుద్దీన్ మొహమ్మద్ గారు ప్రసంగిస్తూ నూతన కార్యవర్గం యొక్క అలోచనలను, ప్రణాళికలను క్లుప్తంగా అందరికీ వివరించారు. వైస్ చైర్మన్ శ్రీ సుదర్శన్ కటారు గారు వందన సమర్పణ గావించారు అస్సోసిఏహన్ అట్టహాసంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవములో తెలుగు అస్సోసిఏషన్ వ్యవస్థాపక సభ్యులు, డోనార్ (దాతలు) సభ్యులు, జీవితకాల సభ్యులు, గత కార్యవర్గ సభ్యులు, వర్కింగ్ కమిటీ సభ్యులు కటుంబ సమేతంగా పాల్గొని నూతన కార్యవర్గానికి తమ అభినందననలు, శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమము విజయవంతము కావటములో నూతన కార్యవర్గ సభ్యులు మరియు వర్కింగ్ కమిటీ సభ్యులందరూ తమ పూర్తి సహాయ సహకారములందించారు.