విదేశాల్లోనూ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని పలు నగరాల్లో ప్రవాస భారతీయులు ర్యాలీలు నిర్వహించారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్యేర్ సహా అమెరికా వ్యాప్తంగా 300 చోట్ల అయోధ్య ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరిగింది. కరీబియన్ దేశం ట్రినిడాడ్, టొబాగోలో నిర్వహించిన వేడుకలో 5 వేల మందికిపైగా భారత సంతతి పౌరులు పాల్గొన్నారు. మారిషస్ ప్రభుత్వం హిందూ ఉద్యోగులకు ప్రత్యేకంగా రెండు గంటల సెలవు ప్రకటించింది. శ్రీరాముడు తిరిగి అయోధ్యలో కొలువుతీరటం సంతోషదాయకం. ప్రజల శాంతి, శ్రేయస్సుకు శ్రీరాముడి బోధనలు, ఆశీర్వాదం కావాలి. జై హింద్ జై మారిషస్ అంటూ మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ ఎక్స్ లో సందేశాన్ని పోస్ట్ చేశారు. అమెరికా, కెనడాల్లో రామ మందిర యాత్ర ను చేపడతామని వరల్డ్ హిందూ కౌన్సిల్ ఆఫ్ అమెరికా, విశ్వ హిందూ పరిషత్(కెనడా) సంయుక్తంగా ప్రకటించాయి. 45 రోజులపాటు సాగే ఈ యాత్రలో రెండు దేశాల్లోని దాదాపు 1000కిపైగా ఆలయాల్ని సందర్శిస్తామని తెలిపాయి.