అమెరికా విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ప్రిన్స్టన్ యూనివర్సిటీ నిరసనల్లో పాలుపంచుకున్న భారత సంతతి విద్యార్థిని అచింత్యా శివలింగాన్ని పోలీసులు అరెస్టు చేశారు. క్యాంపస్ పరిసరాల్లో నిరసనల్లో పాల్గొన్నందుకు యూనివర్సిటీ వర్గాలు అచింత్యాతో పాటు మరో విద్యార్థిపై కూడా నిషేధం విధించాయి. అచింత్య తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. ఆమె బాల్యం ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్లో గడిచింది. ప్రిన్స్టన్ యూనివర్సిటీ వర్గాల కథనం ప్రకారం.. కొందరు విద్యార్థులు యూనివర్సిటీలోని మెక్కాష్ కోర్ట్‌యార్డ్‌లో ఓ టెంట్ వేసుకుని నిరసన ప్రారంభించారు. ఆ తరువాత నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు అరెస్ట య్యారు. అనంతరం, టెంట్‌ను తొలగించిన విద్యార్థులు అక్కడే కూర్చుని తమ నిరసన తెలిపారు. తొలుత 110 మంది నిరసన కార్యక్రమంలో పాల్గొనగా గురువారాని కల్లా ఈ సంఖ్య 300కు చేరింది. విద్యార్థులు అరెస్టైన విషయాన్ని యూనివర్సిటీ ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ ధ్రువీకరించారు. నిరసనలు కట్టిపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరికలు చేసినా వినిపించుకోకపోవడంతో అరెస్టు చేసినట్టు తెలిపారు. అయితే, విద్యార్థు లపై ఎటువంటి బలప్రయోగం చేయలేదని స్పష్టం చేశారు.