జన్యుపరమైన సమస్యలతో వినికిడి లోపంతో జన్మించిన బ్రిటన్‌కు చెందిన ఎనిమిది నెలల చిన్నారికి జీన్ థెరపీతో వినికిడి శక్తిని పునరుద్ధరించారు వైద్యులు. ఓపల్ సాండీ అనే చిన్నారికి కేంబ్రిడ్జ్‌లోని అడ్డెన్‌బ్రూక్స్ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు ఈ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఎలాంటి వినికిడి పరికరం అవసరం లేకుండానే ఈ చిన్నారి వినగలుగుతున్నదని వైద్యులు తెలిపారు.
ఈ అధునాతన చికిత్స అందుకున్న ప్రపంచంలోనే మొదటి వ్యక్తి ఈ చిన్నారి. చికిత్సలో భాగంగా ముందు చిన్నారి ఎడమ చెవిలోని కోక్లియా(కర్ణావృత్తి)కి జనరల్ అనెస్తీసియా ఇచ్చారు. తర్వాత వినికిడి శక్తిని పునరు ద్ధరించగలిగే జన్యు పదార్థం నకలుతో కూడిన ప్రమాదరహిత ఏఏవీ1 అనే వైరస్‌ను ఆమెకు ఇచ్చారు. ఈ వైరస్ శరీరంలోని కణాలకు జన్యు పదార్థాన్ని సరఫరా చేసి శరీరం నుంచి సహజంగా నిష్క్రమిస్తుంది. ఆ జన్యు పదార్థం వినికిడి శక్తిని పునరుద్ధరించేలా చేస్తుంది. ఈ చికిత్స పూర్తిగా సురక్షితమైనదని వైద్యుడు మనోహర్ తెలిపారు.