కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సత్యభామ. దర్శకుడు సుమన్ చిక్కాల. శ్రీనివాస రావు తక్కళపల్లి, బాబీ తిక్క నిర్మాతలు. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ చిక్కాల చిత్ర విశేషాలు తెలియజేస్తూ కొందరు పోలీస్ అధికారుల జీవితంలో జరిగిన నిజ జీవిత సంఘట నల ఆధారంగా ఈ కథ రాసుకున్నా. సత్యభామ పేరు మన పురాణాల్లో చాలా పవర్‌ఫుల్. అందుకే అదే టైటిల్ పెట్టాం అన్నారు.

ఈ కథలో ఎమోషన్, యాక్షన్ రెండు అంశాలుంటాయి. ఓ పర్పస్‌ను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్నా. కథ వినగానే కాజల్ వెంటనే ఒప్పుకున్నారు. యాక్షన్ పార్ట్ కోసం ఆమె చాలా కష్టపడింది. డూప్‌లేకుండా పోరాట ఘట్టాల్లో పాల్గొంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మహిళలను ఆదుకునే పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ పాత్రతో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో మహిళలకు చక్కటి సందేశం ఉంటుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయొచ్చు. అయితే హైదరాబాద్ నేటివిటీ ఉన్న సినిమా కాబట్టి తెలుగులో విడుదల చేయడం కరెక్ట్ అనుకున్నాం. ప్రస్తుతం కొన్ని కథలు రాస్తున్నా. నా తదుపరి సినిమా వివరాలను త్వరలో వెల్లడిస్తా అన్నారు.
