కేంద్రంలో కొత్త ఎన్‌డియే ప్రభుత్వం ఏర్పాటైన నేపధ్యంలో లోక్‌సభ స్పీకర్ ఎంపికపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలనే అంశంపై బిజెపి అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోంది. అయితే లోక్‌సభ స్పీకర్ పదవిని తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధాని మోడీపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ అనేక సర్దుబాట్లు, సంప్రదింపుల తర్వాత బిజెపి ఎంపికే లోక్‌సభ స్పీకర్ పదవిని ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బిజెపి తరఫున ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధీశ్వరికి లోక్‌సభ స్పీకర్ పదవి ఇచ్చేందుకు బిజెపి నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో బాగా పనిచేసినందున లోక్‌సభ స్పీకర్‌గా పురందేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2014 నుంచి 2019 మధ్య మోదీ తొలి టర్మ్‌లో సుమిత్రా మహాజన్ మహిళా స్పీకర్‌గా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ నారీ శక్తికి పెద్దపీట వేస్తుండడంతో పురంధేశ్వరి పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.