ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణం చేయించారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారీ జనసందోహం మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనగానే, ఆయన కుటుంబ సభ్యులంతా ఎమోషనల్ కావడం కనిపించింది. అదే సమయంలో సభకు హాజరైన వారంతా జై చంద్రబాబు నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో టీడీపీ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండు సార్లు, విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన నాలుగో సారి సీఎంగా ఇవాళ ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చంద్రబాబును అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమాని ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాసవాన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్‌చరణ్ తదితరులు వచ్చారు.