బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన తిరుగుబాటు, అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉన్నదని మాజీ ప్రధాని షేక్ హసీనా చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. తనకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేసిందని, సెయింట్ మార్టిన్స్ ద్వీపం కోసమే ఇదంతా చేసిందని వెల్లడించారు. తాను గనుక వ్యూహాత్మకమైన సెయింట్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించి ఉంటే, తన ప్రభుత్వం కొనసాగేదని పేర్కొన్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు, అల్లర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేయకముందు, భారత్‌కు రాకముందు షేక్ హసీనా జాతినుద్దేశించి మాట్లాడాలనుకొన్నారు. కానీ అమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో సైనిక ఉన్నతాధికారులు అందుకు అనుమతించలేదు. ఆమె జాతినుద్దేశించి చేయాల్సిన ప్రసంగం తాజాగా బయటకు వచ్చిందని మీడియా కథనాలు పేర్కొన్నాయి.