ఉద్యోగుల పని సంబంధిత మానసిక సమస్యలకు చెక్ పెట్టే లక్ష్యంతో ఆస్ట్రేలియాలో తీసుకొచ్చిన ఒక కొత్త చట్టం ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నది. ది ఫెయిర్ వర్క్ అమెండ్‌మెంట్(రైట్ టూ డిస్‌కనెక్ట్) చట్టం కింద ఉద్యోగులు పని గంటలు పూర్తయ్యాక తమ యజమానులను, వారి నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను పట్టించు కోవాల్సిన అవసరం లేదు. బాస్‌లను విస్మరించే హక్కును ఈ చట్టం కల్పిస్తుంది. యాజమాన్యాల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్, సందేశాలను, చెప్పే పనులను తిరస్కరించే ఉద్యోగులకు ఈ చట్టం కొంత మేర రక్షణ కల్పిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చట్టంలో కొన్ని మినహాయింపులు కూడా పొందుపరిచారు. ఉద్యోగుల తిరస్కరణను అసమంజసమైనదనిగా చెప్పేందుకు సదరు ఉద్యోగి జాబ్ రోల్, బాధ్యతలు, కారణం వంటి వాటి ద్వారా కొన్ని ప్రత్యేక పరిస్థితులను చట్టంలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని కంపెనీల యాజమాన్య సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. హడావుడిగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని విమర్శిస్తున్నాయి.