అమెరికాలో దుండగుడి కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ప్రవాస వైద్యుడు డాక్టర్ పేరంశెట్టి రమేశ్ బాబు (64) మరణించారు. అలబామా రాష్ట్రంలోని టసలూసా పట్టణంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో రమేశ్ బాబు అక్కడికక్కడే మరణించారని స్థానిక పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామానికి చెందిన డాక్టర్ పేరంశెట్టి రమేశ్‌బాబు అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా ఉన్నారు. వైద్య వృత్తిలో ఆయనకు 38 ఏండ్ల అనుభవం ఉన్నది. అమెరికాలో పలుచోట్ల దవాఖానలు నిర్మించి ఎందరికో ఉపాధి కల్పించిన రమేశ్‌బాబు, అలబామా రాష్ట్రంలోని టసలూసా ప్రాంతంలో వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వైద్య సేవలకు గుర్తింపుగా అకడి ఓ వీధికి ఆయన పేరు పెట్టారు. కొవిడ్ సమయం లోనూ ఆయన అందించిన విశేష సేవలకు పలు అవార్డులు అందుకొన్నారు. భారత్ నుంచి అమెరికా వెళ్లే రాజకీయ ప్రముఖులకు ఆయన తన ఇంట్లోనే ఆతిథ్యమిచ్చేవారు.
తిరుపతి ఎస్వీ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించారు. అనంతరం జమైకాలో ఎమ్మెస్ పూర్తిచేసి, అమెరికాకు వెళ్లి వైద్యుడిగా స్థిరపడ్డారు. ఆయన భార్య కూడా వైద్యురాలే. వీరికి నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వారంతా అమెరికాలోనే ఉంటున్నారు. ఆగస్టు 15న నాయుడుపేటలో తమ బంధువుల ఇంట జరిగిన వివాహానికి ఆయన హాజరయ్యారు. ఇకడ నుంచి వెళ్లిన కొద్ది రోజులకే ఆయన మరణ వార్త కుటుంబసభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. డాక్టర్ రమేశ్ బాబు తాను చదువుకొన్న మేనకూరు హైస్కూల్‌కు, సొంత గ్రామంలో సాయిబాబా ఆలయ నిర్మాణానికి కూడా విరాళం అందించారు.