పారాలింపిక్స్‌కు రంగం సిద్దమయింది. మరికొన్ని గంటల్లోనే ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఈ క్రీడలు ప్రారంభం కానున్నాయి. మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దఅష్టిని ఆకర్షించిన పారిస్ ఇప్పుడు మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది. 12 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో వివిధ దేశాల నుంచి మొత్తం 4,400 మంది పారా అథ్లెట్లు 549 పతకాల కోసం పోటీపడనున్నారు. ఇక భారత్ విషయానికొస్తే ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి 84 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో ఐదు స్వర్ణాలు సహా 19 పతకాలు కొల్లగొట్టిన మన అథ్లెట్లు ఈసారి అంతకుమించి పతకాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా ఈ సారి పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్, షాట్ పుటర్ భాగ్యశ్రీ జాదవ్ భారత పతాకధారులుగా వ్యవహరించనున్నారు. వీరిద్దరిపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. గత టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన వీరు ఈసారి కూడా అదే ప్రదర్శన కనబర్చాలన్న పట్టుదలతో ఉన్నారు.