ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనై పర్యటన కొనసాగింది. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా ప్రధాని బ్రూనై చేరుకున్నారు. భారత్ ప్రధాని బ్రూనై రావడం ఇదే తొలిసారి. తన పర్యటన సందర్భంగా రెండో రోజైన బ్రూనై రాజు హాజీ హసనల్ బోల్కియాను మోదీ మీట్ అయ్యారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రాజభవనంగా పేరొందిన రాజు నివాసంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. రాజుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు.
మోదీ పర్యటన నేపథ్యంలో బ్రూనై 29వ సుల్తాన్‌గా 1968లో పట్టాభిషిక్తుడైన రాజు హాజీ హసనల్ బోల్కియా రాజవైభోగాల గురించి విస్తృత చర్చ జరుగుతున్నది. ప్రపంచంలోని సంపన్న వ్యక్తుల్లో బోల్కియా ఒకరు. ఆయన చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆయన వద్ద అత్యధిక సంఖ్యలో ఖరీదైన కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియన్ల డాలర్ల ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.