అంతర్జాతీయ ఏఐ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు, రేపు సదస్సు జరుగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశం తో ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సదస్సును ప్రారంభించారు. ప్రపంచం నలుమూలల నుండి 2,000 మంది వ్యక్తులు, కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ తరహా ఏఐ సదస్సు దేశం లోనే తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోంది.
సమాజంపై ఏఐ ప్రభావాన్ని నియంత్రించడం, సవాళ్లను సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న నాలుగో నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. రైల్ ఇంజిన్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు ఏఐ కి వచ్చామన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోందన్నారు.